లడ్డూ వేలంలో రసవత్తర పోరు.. రికార్డు రూ.38,500కు కోటయ్య సొంతం
By Lakavath Sudhir
ఇల్లందు సెప్టెంబర్ 23 (తెలంగాణ గళం) ఇల్లందు మండలం రేపల్లెవాడలో ఫ్రెండ్స్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక సందడి నడుమ ఘనంగా ముగిశాయి. చివరి రోజు వర్షం కురిసినా భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. గ్రామస్తులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. అనంతరం స్వామివారి లడ్డూ, పవిత్ర కలశం, దోతీకి వేలం పాటలు నిర్వహించగా భక్తుల్లో ఆసక్తి నెలకొంది.
ముఖ్యంగా లడ్డూ వేలం ఉత్కంఠగా సాగింది. దరావత్ రాములు, లాకవత్ కోటయ్య మధ్య హోరాహోరీ పోటీ నెలకొనగా, చివరకు రూ.38,500కు లాకవత్ కోటయ్య లడ్డూను దక్కించుకున్నారు. పవిత్ర కలశాన్ని రూ.23 వేలకు గ్రామ సర్పంచ్ బానోత్ శారద బాలాజీ, దోతీని రూ.12,301కు బానోత్ నాగ దక్కించుకున్నారు. గ్రామంలో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో వేలం పాటలు రికార్డు ధరలు పలకడం ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.




