ఆంధ్రప్రదేశ్

*టీటీడీ ఈవో ఇచ్చిన రాతపూర్వక హామీలను వెంటనే అమలు చేయాలి*

తిరుపతి, సెప్టెంబర్ 8, తెలంగాణ గళం జిల్లా ప్రతినిధి:స్విమ్స్ కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం 85 రోజుల పాటు పోరాటం చేసిన అనంతరం అధికారులు ఇచ్చిన రాతపూర్వక హామీలను వెంటనే అమలు చేయాలని స్విమ్స్…

By · · Updated

Share this article


తిరుపతి, సెప్టెంబర్ 8, తెలంగాణ గళం జిల్లా ప్రతినిధి:

స్విమ్స్ కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం 85 రోజుల పాటు పోరాటం చేసిన అనంతరం అధికారులు ఇచ్చిన రాతపూర్వక హామీలను వెంటనే అమలు చేయాలని స్విమ్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్–సీఐటీయూ డిమాండ్ చేసింది. బుధవారం జరిగే టీటీడీ పాలకమండలి సమావేశంలో స్విమ్స్ కార్మికుల సమస్యలను చర్చించి తక్షణ పరిష్కారం చూపాలని కోరారు. సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ, స్విమ్స్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం గతంలో 10 రోజుల పాటు రిలే నిరసన దీక్షలు నిర్వహించినా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. దీంతో 2026 ఫిబ్రవరి 27 నుంచి మరోసారి 85 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించామని తెలిపారు. కార్మికులు ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్న సమయం లో టీటీడీ ఈవో జోక్యం చేసుకుని చర్చలు జరిపించారని, అనంతరం అధికారులు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. 2026 మే 22న స్విమ్స్ డైరెక్టర్ మూడు నెలల్లో కార్మిక సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని రాతపూర్వకంగా హామీ ఇచ్చారని, ఆ హామీ ప్రకారం ఆగస్టు 22తో మూడు నెలల గడువు పూర్తయిందన్నారు.సెప్టెంబర్ 8 అయినప్పటికీ సమస్యలు పూర్తిగా పరిష్కారం కాకపోవడం, హామీల అమలులో జాప్యం చేయడాన్ని వారు విమర్శించారు. గతంలో కూడా హామీలు ఇచ్చి అమలు చేయని పరిస్థితి ఉందని, రాతపూర్వకంగా ఇచ్చిన హామీలకైనా విలువ ఉండాలని అన్నారు. స్విమ్స్‌లో 33 సంవత్సరాలుగా పనిచేస్తున్న వార్డు బాయ్‌లను ఇప్పటికీ శానిటేషన్ విభాగంలో చూపించడం సరికాదని, వారు చేస్తున్న వాస్తవ విధులకు అనుగుణంగా వార్డు బాయ్‌లుగా గుర్తించి తగిన కేటగిరీలోకి మార్చాలని కోరారు. గ్రేడ్–III బేసిక్ పే, అసిస్టెంట్ తదితర కేటగిరీలకు అనుగుణంగా వారి వేతనాలను సవరించి పెంచాలని, ఇప్పటివరకు రావాల్సిన వేతన బకాయిలు, అరియర్స్‌ను పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న కార్మికులను స్విమ్స్‌లో నేరుగా తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్ విధానానికి ముగింపు పలికి కార్మికుల భవిష్యత్తుకు స్విమ్స్ యాజమాన్యమే బాధ్యత వహించాలని కోరారు. వార్డు బాయ్‌లకు యూనిఫాంలు, గుర్తింపు బ్యాడ్జీలు అందించాలని, పదవీ విరమణ వయస్సుకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కార్మికులకు అమలు చేయాలని తెలిపారు. సమ్మె సందర్భంగా అధికారులు ఇచ్చిన రాతపూర్వక హామీలన్నింటినీ నిర్దిష్ట గడువులోగా అమలు చేయాలని కోరారు. మూడు నెలల గడువు ముగిసిన తర్వాత కూడా హామీలను అమలు చేయకుండా జాప్యం చేయడం సరైన విధానం కాదని, రేపటి టీటీడీ పాలకమండలి సమావేశంలో అయినా స్విమ్స్ కార్మికుల సమస్యలను ప్రత్యేకంగా చర్చించి, రాతపూర్వక హామీలన్నింటినీ అమలు చేసేలా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. హామీల అమలులో మరింత జాప్యం జరిగితే కార్మికులు మరో దశ పోరాటానికి సిద్ధమవుతారని తెలిపారు. స్విమ్స్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే సామూహిక వినతికి కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని సీఐటీయూ నగర ఉపాధ్యక్షులు కే. వేణుగోపాల్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో స్విమ్స్ నాయకులు గోపి, జయచంద్ర, వెంకటేష్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Tags: