ఆరోగ్యం

పామాయిల్ వాడితే కొలెస్ట్రాల్ పెరుగుతుందా, రోజూ ఎంత మోతాదులో వాడాలో తెలుసా?

మన ఇళ్లల్లో చాలా మంది ఎక్కువగా పామాయిల్ వాడుతుంటారు. ఇక, పామాయిల్ స్మోక్ పాయింట్ (దాదాపు 232°C) చాలా ఎక్కువ. అందుకే పారిశ్రామికంగా, డీప్ ఫ్రైయింగ్‌కు దీన్ని ఎక్కువగా ఎంచుకుంటారు. అయితే దీన్ని మళ్లీ వ…

By · · Updated

Share this article
పామాయిల్ వాడితే కొలెస్ట్రాల్ పెరుగుతుందా, రోజూ ఎంత మోతాదులో వాడాలో తెలుసా?


మన ఇళ్లల్లో చాలా మంది ఎక్కువగా పామాయిల్ వాడుతుంటారు. ఇక, పామాయిల్ స్మోక్ పాయింట్ (దాదాపు 232°C) చాలా ఎక్కువ. అందుకే పారిశ్రామికంగా, డీప్ ఫ్రైయింగ్‌కు దీన్ని ఎక్కువగా ఎంచుకుంటారు. అయితే దీన్ని మళ్లీ వేడి చేయకుండా ఒక్కసారికే పరిమితం చేయాలి. అయితే, పామాయిల్ వాడకం సురక్షితమేనా? ఎంత మోతాదులో వాడాలి?
సమతుల్య ఆహారంలో భాగంగా మితంగా తీసుకున్నప్పుడు పామాయిల్ శరీరానికి నేరుగా హాని చేయదు. అయితే, ఇందులో సంతృప్త కొవ్వులు (Saturated Fats) ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందుకే దీన్ని ఎక్కువగా లేదా నిరంతరం వాడటం గుండె ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అప్పుడప్పుడు పామాయిల్‌తో వండిన ఆహారం తినడం వల్ల పెద్దగా సమస్య ఉండదు. కానీ వేపుళ్లు, ప్యాక్ చేసిన స్నాక్స్, బేకరీ వస్తువులు, ప్రాసెస్ చేసిన ఆహారాల ద్వారా దీన్ని రోజూ ఎక్కువగా తీసుకోవడమే ఆందోళన కలిగించే అంశం.
పామాయిల్‌లో విటమిన్-ఇ సమ్మేళనాలు ఉంటాయి, అలాగే అధిక ఉష్ణోగ్రతల వద్ద వండేటప్పుడు ఇతర నూనెలతో పోలిస్తే ఇది త్వరగా పాడవకుండా నిలకడగా ఉంటుంది. రోజువారీ వంటలకు కేవలం పామాయిల్‌పైనే ఆధారపడకుండా, రకరకాల నూనెలను మారుస్తూ వాడటం, సహజ ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. పామాయిల్ గుండె ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, మిగతా నూనెలతో పోలిస్తే ఎలా ఉంటుంది, రోజు ఎంత మోతాదులో తీసుకోవాలి ఇలాంటి పూర్తి వివరాల్ని క్లినికల్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ ఎడ్వినా రాజ్ (హెడ్ ఆఫ్ సర్వీసెస్ - క్లినికల్ న్యూట్రిషన్ & డైటెటిక్స్, ఆస్టర్ సిఎమ్‌ఐ హాస్పిటల్, బెంగళూరు) అందించారు.
పామాయిల్‌లోని సంతృప్త కొవ్వులు చెడు కొలెస్ట్రాల్, గుండె ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?
పామాయిల్‌లో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడానికి (Plaque), కాలక్రమేణా గుండె జబ్బులు రావడానికి ఈ చెడు కొలెస్ట్రాల్ ప్రధాన కారణం. అయితే, పామాయిల్ స్థానంలో మనం ఏ నూనె వాడుతున్నామనే దానిపై కూడా ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.
పామాయిల్ వంటి సంతృప్త కొవ్వులకు బదులుగా ఆవనూనె, వేరుశెనగ నూనె లేదా సన్‌ఫ్లవర్ నూనె వంటి అసంతృప్త కొవ్వులు (Unsaturated Fats) వాడితే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. కాబట్టి పామాయిల్‌ను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేకపోయినా, గుండె సమస్యల ముప్పు ఉన్నవారు దీని వాడకాన్ని బాగా తగ్గించాలి.
వంట నూనెనైనా (పామాయిల్‌తో సహా) పదే పదే మరిగించినప్పుడు అధిక ఉష్ణోగ్రత, గాలి, తేమ కారణంగా అందులో రసాయన మార్పులు జరిగి, హానికరమైన ఆక్సిడేషన్ ఉత్పత్తులు, టాక్సిన్స్ విడుదలవుతాయి. నూనెను ఎక్కువసార్లు మరిగించే కొద్దీ అది చిక్కగా, నల్లగా మారి, దుర్వాసనతో కూడిన పొగను వెలువరిస్తుంది. స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలో ఒకే నూనెను మార్చకుండా మళ్లీ మళ్లీ వేడి చేసి వాడుతుంటారు, ఇది ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. కాబట్టి బయట నూనెలో వేయించిన పదార్థాల్ని రోజూ తినడం మానుకోవాలి. ఇంట్లో కూడా తాజా నూనెను మాత్రమే వంటకు వాడాలి.
పామాయిల్ లాంటి శాచురేటెడ్ ఫ్యాట్ నూనెల రోజువారీ పరిమితి ఎంత?
పామాయిల్‌కు సంబంధించి ప్రత్యేకంగా ఇంతే తినాలనే ఒక నిర్దిష్ట పరిమితి లేదు; ఇది వ్యక్తి తీసుకునే మొత్తం క్యాలరీలు, ఇతర ఆహారాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ ఆరోగ్య నిబంధనల ప్రకారం, రోజూ తీసుకునే మొత్తం కేలరీలు సంతృప్త కొవ్వులు (Saturated Fats) 10% కంటే తక్కువగా ఉండాలి (గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి ఈ పరిమితి ఇంకా తక్కువగా ఉండాలి).
ఉదాహరణకు, రోజుకు 2,000 కేలరీలు తీసుకునే వ్యక్తికి అన్ని ఆహారాల ద్వారా కలిపి రోజుకు దాదాపు 22 గ్రాముల సంతృప్త కొవ్వు సరిపోతుంది. పామాయిల్‌లో శాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ కాబట్టి, దీనిని చాలా పరిమితంగా వాడాలి.

Tags: