– పరుగులు పెడుతున్న పనులు!
హనుమకొండ, తెలంగాణ గళం, అక్టోబర్ 13 :
తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన, ఉత్తర తెలంగాణకు వైద్య తలమానికంగా నిలవనున్న వరంగల్ సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. వచ్చే దసరా పండుగ నాటికి ఈ అత్యాధునిక వైద్యాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం, అధికార యంత్రాంగం వేగం పెంచాయి. దీంతో ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
పరుగులెత్తుతున్న నిర్మాణ పనులు:గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సూపర్ స్పెషలిటీ ఆసుపత్రికి సంబంధించి మిగిలిపోయిన చివరి దశ పనులను అధికారులు అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నారు. రాత్రింబవళ్లు తేడా లేకుండా పనులను వేగవంతం చేయడంతో ప్రస్తుతం పనులు తుది దశకు చేరుకున్నాయి. భవనానికి సంబంధించిన ఇంటీరియర్ వర్క్స్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, వైద్య పరికరాల బిగింపు వంటి పనులను అధికారులు వేగంగా పూర్తిచేయిస్తున్నారు.
ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పర్యవేక్షణ:
ఆసుపత్రి నిర్మాణంలో ఎలాంటి ఆలస్యం జరగకుండా సీఎంఓ (CMO) వైద్య కార్యదర్శి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME), జిల్లా కలెక్టర్ మరియు ఇతర ఉన్నత వైద్య అధికారులు దగ్గరుండి పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రతిరోజూ నిర్మాణ ప్రగతిని సమీక్షిస్తూ, అధికారులకు మరియు కాంట్రాక్ట్ ఏజెన్సీలకు తగిన సూచనలు చేస్తూ పనులను పరుగులు తీయిస్తున్నారు.
స్థానిక ప్రజల హర్షం:
వరంగల్‌లోనే సూపర్ స్పెషలిటీ వైద్యం అందుబాటులోకి వస్తే, ఇక్కడి ప్రజలు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం తప్పుతుందని ప్రజలు, రోగుల బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దసరా కానుకగా ఈ ఆసుపత్రి ప్రారంభమైతే ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలకూ వైద్య సేవలు మరింత చేరువవుతాయని వైద్య వర్గాలు భావిస్తున్నాయి.
న్యూస్ ప్రతినిధి: మోడెం సందీప్.






