పరకాల,తెలంగాణ గళం, సెప్టెంబర్ 3
వారం రోజుల్లో 100 పడకల ఆస్పత్రిని ప్రజలకు అందుబాటులోకి తేవాలి..లేదంటే హాస్పిటల్ ఎదుట ధర్నా చేస్తాం.
మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పరకాల 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని పనులు పూర్తికాకుండానే హంగామా చేస్తూ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సోయి లేదా? స్థానిక ఎమ్మెల్యేకు సోయి లేదా అని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రశ్నించారు.
గురువారం పరకాల ప్రభుత్వ ఆస్పత్రిని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సందర్శించి విచారం వ్యక్తం చేశారు.ఒకే బెడ్డుపై ఇద్దరు ముగ్గురు పేషెంట్లను ఉంచి చికిత్స అందిస్తుంటే బాధేసిందన్నారు.ఇలాంటి పరిస్థితులు ప్రజలకు రావొద్దనే
పరకాల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని మంజూరు చేశారని ధర్మారెడ్డి తెలిపారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఆస్పత్రి నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్పత్రికి రంగులు వేసి, పనులు పూర్తికాకుండానే హడావుడిగా ప్రారంభించిందని ఆరోపించారు.
ఆస్పత్రి ప్రారంభించి ఇన్ని రోజులు గడుస్తున్నా ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించలేదని విమర్శించారు. పూర్తిస్థాయిలో పనులు చేపట్టకుండా ముఖ్యమంత్రి ఆస్పత్రిని ప్రారంభించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రారంభోత్సవం రోజే ఆస్పత్రికి అవసరమైన నిధులను ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు.వారం రోజుల్లోగా 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆస్పత్రిని సందర్శించి, ప్రజల తరఫున ధర్నాకు దిగుతారని చల్లా ధర్మారెడ్డి హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
