నందిగామ సిఎస్ న్యూస్. ఆగస్టు 31:
నందిగామ పట్టణంలోని అనాసాగరం వెళ్లే దారిలో, నేషనల్ హైవే పక్కన కృష్ణుడి వేషధారణలో ఉన్న సీనియర్ ఎన్టీ తారక రామారావు విగ్రహానికి అవమానం జరుగుతోంది. విగ్రహం ముందే డ్రైనేజీ మురికి నీరు చెరువులా నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు, ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు.
గత కొన్ని నెలలుగా ఈ మురికి నీరు వెళ్లే దారి లేక నేషనల్ హైవే రోడ్డుపైనే పొలాల్లో నీరు నిలిచినట్లుగా నిలిచిపోయింది. దీంతో భారీ వాహనాలు, టూవీలర్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. వాహనదారులు జారిపడి ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉంది.
మురికి నీరు నిల్వ ఉండటంతో క్రిమి కీటకాలు, దోమలు విపరీతంగా పెరిగి చుట్టుపక్కల నివాసం ఉండే వారు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని స్థానిక ప్రజలు వాపోతున్నారు.
కమిషనర్ ఉన్నారా? లేరా?
గత కొన్ని నెలలుగా ఇదే దుస్థితి ఉన్నా కనీసం కన్నెత్తి చూడని మున్సిపల్ శాఖ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు నందిగామ మున్సిపల్ కమిషనర్ ఉన్నారా లేరా అనేది ప్రశ్నార్థకంగా మారిందని ఎద్దేవా చేస్తున్నారు. ఇంకో గొప్ప విషయం ఏమిటంటే, సీనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని ఇల్లు ఈ విగ్రహానికి అతి చేరువులోనే ఉండి కూడా విగ్రహం వద్ద కనీసం శుభ్రత లేకుండా మురికి నీరు నిలిచిపోయినా పట్టించుకోవడం లేదని ఎన్టీఆర్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా నందిగామ మున్సిపాలిటీ వ్యవస్థ ఎంతో గొప్పదని చెప్పుకుంటున్న అధికారులకు హైవేపై ప్రమాదాలకు ఆహ్వానం పలికే ఈ మురికి నీరు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రమాదం జరిగితే కానీ స్పందించరా అంటూ వాహనదారులు నిలదీస్తున్నారు.
ఇప్పటికైనా మున్సిపల్ ఉన్నతాధికారులు స్పందించి విగ్రహం వద్ద ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించి, హైవేపై నిలిచిన మురికి నీటిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
