ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ..వర్షంలోనూ కొనసాగిన రైతుల పోరుబాట
పరకాల తెలంగాణ గళం:03
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు.
గురువారం దామెర మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ కాలువ నుంచి నడికుడ శివారు వరకు రైతులతో కలిసి ఆయన పాదయాత్ర నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కొనసాగిన ఈ పాదయాత్రకు రైతులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చారు. మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. రైతులతో కలిసి చల్లా ధర్మారెడ్డి ఎడ్లబండి, ట్రాక్టర్ నడిపి నిరసనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా, కౌలు రైతులకు భరోసా, వరి పంట బోనస్, రైతుబీమా హామీలు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
యూరియా కోసం రైతులు రోజుల తరబడి పడుతున్న ఇబ్బందులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.
రైతు సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం హామీలతో కాలయాపన చేస్తోందని విమర్శించారు.
“రైతు ఓటు కోసం హామీలు ఇవ్వడం కాదు.. రైతు పొలంలో పంట పండే వరకు ప్రభుత్వం అండగా నిలవాలి” అని చల్లా ధర్మారెడ్డి అన్నారు.
రైతుల కన్నీటి గోసకు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
