లింక్ పత్రాలు, ధరణి రికార్డులను నిష్పాక్షికంగా పరిశీలించి హద్దులు తేల్చాలని అధికారులకు ఆదేశం.
By Lakavath Sudhir
ఇల్లందు, సెప్టెంబర్ 25 (తెలంగాణ గళం): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా సమగ్ర వసతి పాఠశాల నిర్మాణ స్థలాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇల్లందు మండలం బైపాస్ రోడ్డు సమీపంలోని రాజీవ్‌నగర్ వద్ద, పాఠశాల భవన సముదాయ నిర్మాణానికి ప్రతిపాదించిన సర్వే నంబర్ 549/1 లోని 20 ఎకరాల స్థలంలో ప్రస్తుతం జరుగుతున్న భూ సర్వే ప్రక్రియను ఆయన స్వయంగా పర్యవేక్షించి అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా స్థానిక రైతులు కలెక్టర్‌ను కలిసి తమ అభ్యంతరాలను, ఆవేదనను వ్యక్తంచేశారు. సదరు సర్వే నంబర్ భూమికి సంబంధించి కొంత భూ వివాదం ఉందని, తాము సుమారు 15 ఏళ్లుగా ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రైతులు తమ వద్ద ఉన్న పాత పట్టాదారు పాస్‌బుక్‌లు, ఇతర భూ సంబంధిత లింక్ పత్రాలను కలెక్టర్‌కు చూపిస్తూ, తమ సాగు భూములకు స్పష్టమైన సరిహద్దులను గుర్తిస్తూ తమ హక్కులను కాపాడాలని కోరుతూ సంబంధిత పత్రాలను సమర్పించారు.రైతులు సమర్పించిన పత్రాలు, అధికారుల వద్ద ఉన్న రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్ అంకిత్, రికార్డుల ఆధారంగా క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను సరిపోల్చి సరిహద్దులను స్పష్టంగా నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు. సర్వే నంబర్ 549/1కు సంబంధించిన లింక్ పత్రాలు, ధరణి రికార్డులు, రెవెన్యూ రికార్డులు, పాత నక్షాలు, మరియు భూ భారతి రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. రికార్డుల్లోని వివరాలను క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులతో పారదర్శకంగా సరిపోల్చాలని, ఎలాంటి జాప్యం లేకుండా సర్వేను పూర్తి చేసి వాస్తవ సరిహద్దులను నిర్ధారించాలని స్పష్టం చేశారు.తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యున్నత స్థాయి వసతులతో ఈ పాఠశాలలను నిర్మిస్తుండగా, ఇల్లందులో భూ వివాదాల వల్ల ఈ పనులు కొంత జాప్యం అయ్యాయి. ఈ నేపథ్యంలో, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ, క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం వాస్తవ సరిహద్దులను నిర్ధారిస్తూ క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులపై ఒక సమగ్ర నివేదికను వెంటనే తనకు సమర్పించాలని రెవెన్యూ, సర్వే భూ రికార్డుల అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో RDO మధు, ఇల్లందు తహసీల్దార్ ఖాసిం, సర్వే సహాయ సంచాలకులు శ్రీనివాస్, ఇల్లందు పురపాలక సంఘ అధికారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, సంబంధిత శాఖల అధికారులు, సర్వేయర్లు మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.





