ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఘటన.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
మెట్‌పల్లి, అక్టోబర్ 09,తెలంగాణ గళం:
విద్యార్థినులకు విద్యాబుద్ధులు నేర్పించి, వారి భద్రతను కాపాడాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వ వసతి గృహంలో బాలికలతో బరువైన ట్రంక్ పెట్టెలు మోయించిన ఘటన విమర్శలకు దారితీసింది. మెట్‌పల్లి పట్టణంలోని కోర్టు ఎదురుగా ఉన్న ప్రభుత్వ బాలికల వసతి గృహంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వం నుంచి వసతి గృహానికి వచ్చిన ట్రంక్ పెట్టెలను లారీ నుంచి కిందకు దించేందుకు విద్యార్థినులను వినియోగించినట్లు తెలుస్తోంది. వసతి గృహంలో సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ, విద్యార్థినులతోనే బరువైన సామగ్రిని మోయించడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థినుల సంక్షేమం, భద్రతకు ప్రాధాన్యమివ్వాల్సిన సిబ్బంది ఇలాంటి పనులకు బాలికలను ఉపయోగించడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థినులపై చదువుల ఒత్తిడి ఇప్పటికే ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో బరువైన పెట్టెలు మోయించడం వల్ల వారికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో బాలికలకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు, వారి ఆరోగ్యం, భద్రత పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.
ఈ ఘటనపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి, విద్యార్థినులతో ట్రంక్ పెట్టెలు మోయించడానికి గల కారణాలను తెలుసుకోవాలని స్థానికులు, ప్రజాసంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. బాధ్యుల నిర్లక్ష్యం తేలితే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.





