రాజకీయం

పరకాల అంబేద్కర్ సెంటర్లో వంటావార్పు.

కాంగ్రెస్ దగా పాలనపై బీఆర్‌ఎస్ నిరసన.. రోడ్డుపైనే మహిళలతో భోజనం చేసిన చల్లా.. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం.. మహిళలు, వృద్ధులు, విద్యార్థులకు తీరని అన్యాయం. చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల…

By · · Updated

Share this article
పరకాల అంబేద్కర్ సెంటర్లో వంటావార్పు.

కాంగ్రెస్ దగా పాలనపై బీఆర్‌ఎస్ నిరసన..

రోడ్డుపైనే మహిళలతో భోజనం చేసిన చల్లా..

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం..

మహిళలు, వృద్ధులు, విద్యార్థులకు తీరని అన్యాయం.

చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే.

తెలంగాణ గళం, సెప్టెంబర్ 4: 

 

పరకాల: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు.1000 రోజుల కాంగ్రెస్ దగా పాలనకు నిరసనగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పరకాల అంబేద్కర్ సెంటర్‌లో నిర్వహించిన వంటావార్పు కార్యక్రమానికి మహిళలు, వృద్ధులు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.రోడ్డుపైనే పొయ్యిలు వెలిగించి వంటలు చేసి మహిళలతో కలిసి మాజీ ఎమ్మెల్యే భోజనం చేస్తూ నిరసన తెలిపారు.

 

ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటిగా ప్రజలకు దూరం చేస్తున్నారని మండిపడ్డారు.

 

కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల కింద ఇస్తామన్న తులం బంగారం ఎక్కడుందని ప్రశ్నించారు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు అండగా నిలిచిన ఈ పథకాలను నిర్వీర్యం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పటికీ ఆ హామీని అమలు చేయలేదన్నారు.

 

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని గొప్పలు చెప్పుకుంటూ.. మరోవైపు పురుషులపై చార్జీల భారం పెంచి కుటుంబాల్లోనే పంచాయతీలు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారని చల్లా ధర్మారెడ్డి విమర్శించారు.

 

మహిళల రక్షణకు పటిష్టమైన భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఆ హామీని కూడా పట్టించుకోవడం లేదన్నారు. మహిళా సంఘాలకు పక్కా భవనాలు నిర్మిస్తామని చెప్పి ఆ హామీని పక్కన పెట్టారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో మహిళా సంఘాలకు నిర్మించిన భవనాలే నేటికీ కనిపిస్తున్నాయని, మహిళా సంఘాల సభ్యులను అడిగితే ఎవరు వారి కోసం పనిచేశారో చెబుతారని అన్నారు.

 

మహిళా కమిషన్‌ను బలోపేతం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మహిళల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా కమీషన్ల వసూళ్లకే ప్రాధాన్యత ఇస్తోందని చల్లా ధర్మారెడ్డి ఘాటుగా విమర్శించారు.

 

కేసీఆర్ కిట్‌ను మాయం చేసి గర్భిణీలు, బాలింతలకు అందాల్సిన భరోసాను దూరం చేశారని, మహిళలకు రూ.2,500 ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వృద్ధులకు కేసీఆర్ ప్రభుత్వం అందించిన పెన్షన్లే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేముందని నిలదీశారు.

 

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని చల్లా ధర్మారెడ్డి డిమాండ్ చేశారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, పేదల సంక్షేమాన్ని విస్మరిస్తే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.

 

ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తుచేస్తూ.. ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని చల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు.

 

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Tags: