తాజా వార్తలు

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు తావివ్వొద్దు: కలెక్టర్‌ అంకిత్‌

 1.28 లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యం.. అక్టోబర్‌ 1 నాటికి 190 కేంద్రాలు సిద్ధం సన్న ధాన్యానికి క్వింటాకు రూ.2,961 వరకు ధర By Lakavath Sudhir  సెప్టెంబర్ 29 తెలంగాణ గళం : వానాకాలం ధాన్యం కొనుగో…

By · · Updated

Share this article
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు తావివ్వొద్దు: కలెక్టర్‌ అంకిత్‌
  •  1.28 లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యం.. అక్టోబర్‌ 1 నాటికి 190 కేంద్రాలు సిద్ధం
  • సన్న ధాన్యానికి క్వింటాకు రూ.2,961 వరకు ధర

By Lakavath Sudhir 

సెప్టెంబర్ 29 తెలంగాణ గళం :

వానాకాలం ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్‌తో కలిసి ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లాలో సుమారు 1.28 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలుకు 190 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్‌ 1 నాటికి అన్ని కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశించారు.

ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాకు రూ.2,461, సాధారణ రకానికి రూ.2,441 మద్దతు ధరగా చెల్లించనున్నట్లు తెలిపారు. గుర్తించిన ఏడు సన్న రకాల ధాన్యానికి అదనంగా రూ.500 బోనస్‌ అందిస్తామని, దీంతో క్వింటాకు రూ.2,961 వరకు ధర లభిస్తుందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, టార్పాలిన్లు, తేమ కొలిచే యంత్రాలు, తూకపు పరికరాలు, గన్నీ సంచులు సిద్ధంగా ఉంచాలని సూచించారు.

కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసి రసీదులు అందించాలని, రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. నాణ్యత పేరుతో రైతులను ఇబ్బంది పెట్టడం, తరుగు పేరుతో అన్యాయంగా కోతలు విధించడం సహించేది లేదని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం అక్రమంగా రాకుండా సరిహద్దుల్లో నిఘా పెంచాలని సూచించారు.

వర్షాల నేపథ్యంలో ధాన్యం నిల్వకు గోడౌన్లు, ఫంక్షన్‌ హాళ్లు, ఇతర భవనాలను ముందుగానే సిద్ధం చేయాలని, తూకపు బాట్లను తనిఖీ చేసి సీల్స్‌ వేయాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు త్వరితగతిన తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విద్యాచందన, డీసీఎస్‌ఓ ప్రేమ్‌కుమార్, డీఎంవో త్రినాథ్‌బాబు, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, సంబంధిత శాఖల అధికారులు, రైస్‌ మిల్లర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags: