మెట్‌పల్లి, అక్టోబర్ 05,తెలంగాణ గళం:
ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణే ప్రధాన లక్ష్యంగా బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 6న నిర్వహించనున్న రణభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు యాదగిరి బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అనుప్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం మెట్‌పల్లిలో వారు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా మూతపడిన ముత్యంపేట చక్కెర కర్మాగారం పునరుద్ధరణ కోసం రైతులు ఎదురుచూస్తున్నారని తెలిపారు.
షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరిగితే పరిసర ప్రాంతాల్లోని వేలాది మంది చెరుకు రైతులకు ప్రయోజనం కలుగుతుందని, రైతులకు వ్యవసాయంపై భరోసా పెరగడంతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని అన్నారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 6న ఫ్యాక్టరీ వద్ద రణభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడనున్నారని పేర్కొన్నారు.
రణభేరి కార్యక్రమానికి నియోజకవర్గంలోని రైతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం చేపట్టే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మెట్‌పల్లి పట్టణ అధ్యక్షుడు నవీన్ తదితరులు పాల్గొన్నారు.





