సిలిండర్‌పై రూ.120 అదనపు వసూలు.. రసీదు లేదు.. బుకింగ్ లేకుంటే రూ.1,500?
ఏజెన్సీలకు తెలిసే జరుగుతోందా? గట్టిగా ప్రశ్నిస్తే ‘డిస్కౌంట్’.. అధికారుల తనిఖీలు ఎప్పుడు?
By Lakavath Sudhir:
ఇల్లందు అక్టోబర్ 1 తెలంగాణ గళం:
నిత్యావసర వస్తువుల ధరల భారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ.. గ్యాస్ సిలిండర్ డెలివరీ పేరుతో అదనపు వసూళ్ల ఆరోపణలు వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇల్లందు మండలం పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో ఒక్కో సిలిండర్‌పై సుమారు రూ.120 అదనంగా వసూలు చేస్తున్నారంటూ వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తానికి రసీదు ఇవ్వాలని అడిగినా డెలివరీ సిబ్బంది స్పందించడం లేదని, ‘ఇంతే.. తీసుకుంటే తీసుకోండి.. లేకుంటే లేదు’ అన్నట్లుగా సమాధానం ఇస్తున్నారని చెబుతున్నారు.
బుకింగ్ ఉంటే ఒక రేటు.. లేకుంటే మరో రేటు?
గ్యాస్ బుకింగ్ ఉన్న వినియోగదారులకు ఒక విధంగా, బుకింగ్ లేకుండా సిలిండర్ కోరేవారికి మరో విధంగా వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బుకింగ్ చేయకుండానే సిలిండర్ కావాలంటే రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు స్థానికంగా వినిపిస్తున్నాయి. బుకింగ్ లేకుండా సిలిండర్ ఎలా డెలివరీ అవుతోంది? ఆ సిలిండర్లు ఏ కోటా నుంచి వస్తున్నాయి? డెలివరీ వివరాలు రికార్డుల్లో ఎలా నమోదవుతున్నాయి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రసీదు అడిగితే ఎందుకు ఇవ్వడం లేదు?
సిలిండర్ ధరకు అదనంగా వసూలు చేస్తున్న సుమారు రూ.120కు రసీదు ఇవ్వకపోవడంపై వినియోగదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అదనపు మొత్తానికి అధికారికంగా ఏదైనా నిబంధన ఉంటే రసీదు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. డెలివరీ సమయంలో అదనపు మొత్తాన్ని తీసుకుంటూ.. దానికి ఎలాంటి ఆధారం ఇవ్వకపోవడంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
గట్టిగా ప్రశ్నిస్తే ‘డిస్కౌంట్’ ఎందుకు?
అదనపు మొత్తంపై వినియోగదారులు గట్టిగా ప్రశ్నించినప్పుడు కొంత తగ్గించి తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఒకే సిలిండర్‌కు ఒకరి నుంచి ఒక మొత్తం, మరొకరి నుంచి మరో మొత్తం వసూలు చేయడం వెనుక కారణమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రసీదు లేకుండా వసూలు చేస్తున్న మొత్తాలకు లెక్కలేమిటి? ఈ అదనపు డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? అనే ప్రశ్నలు వినియోగదారుల్లో వ్యక్తమవుతున్నాయి.
ఏజెన్సీలకు తెలిసే జరుగుతోందా?
డెలివరీ సమయంలో అదనంగా వసూలు చేస్తున్న సుమారు రూ.120 విషయం సంబంధిత గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యానికి తెలుసా? లేక డెలివరీ సిబ్బంది స్వయంగా ఈ మొత్తాలను వసూలు చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఏజెన్సీలకు విషయం తెలిసే ఉంటే అదనపు వసూళ్లకు సంబంధించిన లెక్కలు, రసీదులు, రికార్డులు ఎక్కడున్నాయనే ప్రశ్న తలెత్తుతోంది. యాజమాన్యానికి తెలియకుండా సిబ్బంది వసూలు చేస్తున్నట్లయితే వారిపై ఏజెన్సీలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయో వెల్లడించాల్సిన అవసరం ఉంది.
బుకింగ్ లేకుండా రూ.1,500కు సిలిండర్ ఎలా?
బుకింగ్ లేకుండానే అధిక మొత్తానికి సిలిండర్ అందుతున్నారనే ఆరోపణలపై కూడా అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. సాధారణ వినియోగదారులు బుకింగ్ చేసి సిలిండర్ కోసం వేచి ఉండాల్సి వస్తుండగా.. బుకింగ్ లేకుండానే అధిక ధరకు సిలిండర్ ఎలా లభిస్తుందనే అంశంపై విచారణ జరపాలని కోరుతున్నారు. ఈ వ్యవహారం బ్లాక్ మార్కెట్‌కు అవకాశం కల్పిస్తుందా అనే కోణంలోనూ పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సివిల్ సప్లై అధికారుల తనిఖీలు అవసరం
ఇల్లందు మండలం పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలు, పరిసర గ్రామాల్లో గ్యాస్ ఏజెన్సీల బుకింగ్, స్టాక్, సరఫరా, డెలివరీ రికార్డులను సివిల్ సప్లై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. వినియోగదారుల నుంచి అదనపు మొత్తాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లు జరుగుతున్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
‘నిత్యావసర వస్తువుల ధరలే భారంగా మారిన సమయంలో.. గ్యాస్ సిలిండర్‌పై మళ్లీ ఈ అదనపు భారం ఎందుకు?’ అని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ఏజెన్సీ యాజమాన్యాలకు ఈ వ్యవహారంపై పూర్తి సమాచారం ఉందా? ఉంటే ఏ చర్యలు తీసుకున్నారు? అనే విషయాలను సంబంధిత అధికారులు, ఏజెన్సీలు స్పష్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు.





