పాలసీదారులకు విశేష సేవలు అందిస్తున్న జీవన్‌ను అభినందించిన అధికారులు, తోటి ఏజెంట్లు
మెట్‌పల్లి, అక్టోబర్ 09,తెలంగాణ గళం:
ఎల్ఐసీ ఏజెంట్‌గా 20 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న దేశెట్టి జీవన్‌ను ఎల్ఐసీ అధికారులు, తోటి ఏజెంట్ మిత్రులు ఘనంగా సన్మానించారు. మెట్‌పల్లి పట్టణ శివారులోని బాంక్వెట్ హోటల్‌లో ఎల్ఐసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఎల్. రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్గనైజేషన్ సమావేశంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది.
గత 20 సంవత్సరాలుగా ఎల్ఐసీ ఏజెంట్‌గా కొనసాగుతున్న దేశెట్టి జీవన్ పాలసీదారులకు వివిధ రకాల సేవలు అందిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. వృత్తి పట్ల బాధ్యత, అంకితభావం, సమయస్ఫూర్తితో పనిచేస్తూ పాలసీదారుల నమ్మకాన్ని పొందడం అభినందనీయమని ఈ సందర్భంగా అధికారులు, తోటి ఏజెంట్లు పేర్కొన్నారు.
బీమా రంగంలో రెండు దశాబ్దాలుగా సేవలందించడం, పాలసీదారులకు అవసరమైన సేవలను అందుబాటులో ఉంచడం ఎంతో బాధ్యతతో కూడుకున్న విషయమని అన్నారు. వృత్తి పట్ల నిబద్ధతతో ముందుకు సాగుతూ విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జీవన్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
అనంతరం దేశెట్టి జీవన్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఎల్. రాజేందర్‌రెడ్డి, మెట్‌పల్లి బ్రాంచ్ సీనియర్ మేనేజర్ కె. రామశర్మ, మేనేజర్ ఐ. రామకృష్ణ, సీనియర్ ఏజెంట్లు, ఇతర ఏజెంట్ మిత్రులు పాల్గొన్నారు.





