మెట్‌పల్లి, అక్టోబర్ 08,తెలంగాణ గళం:
మెట్‌పల్లి మండలంలోని ఆత్మకూరు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గురువారం స్థానిక ప్రజాప్రతినిధులు శ్రీకారం చుట్టారు. గ్రామంలో రహదారి సౌకర్యాలను మెరుగుపరిచే ఉద్దేశంతో చేపట్టిన ఈ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రత్యేక చొరవతో వి.బి.-జీ రామ్‌జీ పథకం కింద రూ.5 లక్షలు మంజూరైనట్లు స్థానిక నాయకులు తెలిపారు.
గ్రామంలోని ప్రజలు, రైతులు, విద్యార్థులు, వాహనదారులు రాకపోకలు సాగించే మార్గాల్లో రహదారి సౌకర్యం మెరుగుపడనుందని వారు పేర్కొన్నారు. సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయితే వర్షాకాలంలో రోడ్లపై ఏర్పడే బురద, గుంతలు తదితర సమస్యలు తగ్గడంతో పాటు ప్రజలకు రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారనున్నాయని తెలిపారు.
మంజూరైన నిధులను సద్వినియోగం చేసుకుని పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని, నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరారు. అభివృద్ధి పనుల ద్వారా గ్రామంలో మౌలిక వసతులు మరింత మెరుగుపడతాయని నాయకులు అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిట్యాల రాజారాం, ఉప సర్పంచ్ కసాడి తిరుపతి, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.





